ఇంటర్నెట్‌డెస్క్: శుద్ధి చేసిన తమ యురేనియంపై అమెరికా చెయ్యి వేయకుండా ఇరాన్ అత్యంత ప్రమాదకర ఉచ్చును పరిచింది. డీల్ కుదిరిన తర్వాత ఆ యురేనియం నిర్వీర్యం చేస్తామంటూ ఓ పక్క ట్రంప్ చెబుతుండగా.. మరోవైపు ఎవరూ ఆ యురేనియం దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా ఇరాన్ అడుగుకో గండం చొప్పున సిద్ధం చేసింది. ఇరాన్ అనుమతించినా.. అమెరికా సైన్యానికి అక్కడికి వెళ్లడం ప్రాణాంతకమే.
శుద్ధి చేసిన యురేనియం అమెరికా దళాల చేతిలో పడకుండా ఇటీవల కాలంలో ఇరాన్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఒక వేళ అమెరికాతో చర్చలు సఫలమై.. శుద్ధి చేసిన యురేనియాన్ని ఒక చోటకు చేర్చి ధ్వంసం చేయాల్సిన బాధ్యత ఇరాన్‌పై పడే అవకాశం కూడా ఉంది. దీంతో అలాంటి పరిస్థితుల్లో తమ దళాలు కూడా దాని వద్దకు చేరలేనంత కఠినంగా ఆ యురేనియం నిల్వల వద్ద ఏర్పాట్లు చేస్తోంది. చాలా చోట్ల సొరంగాలను కూల్చేయడం.. వాటి ముఖద్వారాల వద్ద మందుపాతరలు ఇతర పేలుడు పదార్థాలతో ట్రాప్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ యురేనియం వెలికి తీయాలంటే.. భారీ యంత్రాలు, డీమైనింగ్ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒప్పందం ప్రకారం యురేనియం అప్పజెప్పాల్సిన పరిస్థితుల్లో ఇరాన్ కూడా చేతులెత్తేసే అవకాశం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది. శుద్ధి చేసిన యురేనియంలో అత్యధిక భాగం ఇస్ఫహాన్‌లోనే ఉండగా.. కొద్దోగొప్పో ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
